22 నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

22 నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Sep 14 2025 3:15 AM | Updated on Sep 14 2025 3:15 AM

22 ను

22 నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ముస్తాబవుతున్న అమ్మవార్ల ఆలయాలు

వివిధ అలంకరణలో భక్తులకు దర్శనం

కాళేశ్వరంలో బారులుదీరనున్న భక్తులు

కాళేశ్వరం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాల్లో ఈనెల 22 నుంచి (సోమవారం) శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. పదకొండు రోజులు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 22న ప్రారంభమై అక్టోబర్‌ 2న (గురువారం) నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. శ్రీశుభానందదేవి (పార్వతీ), శ్రీ మహా సరస్వతీ అమ్మవార్ల ఆలయాలను ప్రత్యేకంగా అలయ అర్చకులు, అధికారులు ముస్తాబు చేస్తున్నారు. 11 రోజుల పాటు ఒక్కో అలంకరణలో భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తారు. ప్రతి రోజు గణపతి పూజ, స్వస్తి పుణ్యహవచనం, అఖండ దీపారాధన, రుత్విగ్వరణం, దీక్షావస్త్రాధారణ, రక్షాబంధనం, మండపారాధన, హారతి, మంత్రపుష్పం, అగ్నిప్రతిష్టాపన, నవగ్రహ, రుద్ర, నమక, చమక, పంచసూక్తి, మూలమంత్ర చండీహోమం తదితర పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజా కార్యక్రమాలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకోనున్నారు.

తొమ్మిది అలంకరణలు..

22న బాలత్రిపురా సుందరీ దేవి, 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణదేవి, 25న కాత్యాయనిదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలితాదేవి, 28న మహాచండీ దేవి, 29న మూలనక్షత్రం సందర్భంగా శ్రీసరస్వతిదేవి, 30న దుర్గాదేవి (దుర్గాష్టమి), అక్టోబర్‌ 1న మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి) అదే రోజున మద్యాహ్నం బలిహరణం, పూర్ణాహుతి యాగశాలలో హోమం కార్యక్రమం నిర్వహిస్తారు. 2న రాజరాజేశ్వరీదేవి అలంకరణల్లో భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తారు. దీంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. విజయ దశమి (దసరా) సందర్భంగా సాయంత్రం శ్రీరామాలయం నుంచి గోదావరికి మంగళవాయిద్యాలతో బయలుదేరి 4.30గంటలకు శమీ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం ప్రసాద వితరణ చేస్తారు.

స్వర్ణకిరీట ధారణిగా శుభానందదేవి..

2016 మే 2న అప్పటి సీఎం కేసీఆర్‌–శోభ దంపతులు బహూకరించిన బంగారు కిరీటాన్ని శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీశుభానందదేవి (పార్వతీ) అమ్మవారికి ధరించి ప్రత్యేకంగా అలంకరిస్తారు. దీంతో అమ్మవారు ప్రత్యేకాకర్షణగా దర్శనమి స్తారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు పోలీసు బందోబస్తు నిర్వహిస్తారు. ఉత్సవాలకు 11 రోజులు ప్రత్యేకంగా పూలతో అలంకరణలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ మహేష్‌ తెలిపారు.

22 నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు1
1/1

22 నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement