
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం
భూపాలపల్లి: ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో రైతులు పండిస్తున్న వరిపంట ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటి నుంచే అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో సాగు ఆధారంగా దిగుబడి అయ్యే ధాన్యాన్ని అంచనా వేసి, గతంలో ఏర్పడిన ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.
204 కేంద్రాలు..
జిల్లాలోని 12 మండలాల్లో 1,13,121 ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. ఈసారి కూలీల కొరత కారణంగా కొత్తగా వెదజల్లే పద్ధతిలో 13,928 ఎకరాలు, నాట్లు వేసే పద్ధతిలో 99,193 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఈ ఏడాది కురిసిన వర్షాలు పత్తి, మిర్చి పంటలకు ప్రతికూలంగా ఉండగా.. వరిపంటకు మాత్రం అనుకూలంగా మారాయి. ఫలితంగా గతేడాది ఇదే సీజన్‌లో 1,04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా ఈ సీజన్‌లో మాత్రం 1.52 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఐకేపీ ఆధ్వర్యంలో 36, పీఏసీఎస్ 148, జీసీసీ, కేడీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
గ్రేడ్ ఏ క్వింటాల్‌కు
రూ.2,389..
రైతులు పండించిన ధాన్యానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించింది. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389 ధర నిర్ణయించగా కామన్ రకం ధాన్యానికి రూ.2,369 చెల్లించనుంది. గతేడాది మాదిరిగానే సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ చెల్లించనుంది.
రైతులకు ఇబ్బందులు లేకుండా..
గతంలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిపడా టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, డస్ట్ రిమూవర్స్, తేమ పరిశీలన యంత్రాలు, వేయింగ్ మిషన్లను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే జిల్లాలో వరిసాగు ఒక నెల ఆలస్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ నుంచి వరికోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అప్పటిలోగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
1.52 లక్షల మెట్రిక్ టన్నుల
దిగుబడి అంచనా
204 కొనుగోలు కేంద్రాలు
ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు

ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం