
కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణంలో జాప్యంచేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఇంజినీరింగ్ అధి కారులను ఆదేశించారు. ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాల, ప్రభు త్వ ప్రధాన ఆస్పత్రి నిర్మాణ పనులు, వైద్య సిబ్బంది సమయ పాలన, ఖాళీ పోస్టులు భర్తీ తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాన ఆస్పత్రిలో గోడలపై గుట్కా, ఉమ్మి వేస్తుండడంతో వైద్యసేవలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరిశుభ్రత పాటించాలని చెప్పారు. నిర్మాణంలో వచ్చే వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ప్రధాన ఆస్పత్రిలో విద్యుట్ టు ఫేజ్ నుంచి త్రీ ఫేజ్‌కు మార్చాల్సి ఉందని.. ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. ఆస్పత్రి భవనాల నిర్మాణంలో జాప్యం జరిగితే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేయాలని, స్పందించకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. మహదేవపూర్ ఆస్పత్రిలో ప్రసూతి వైద్యు ల నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రిటికల్ కేర్ కేంద్రం నిర్మాణంలో జాప్యం జరుగుతుందని, ఇప్పటికే రెండు నోటీసులు జారీ చేశామని.. పనులు ప్రారంభించకపోతే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, టీజీఎంఐడీసీ ఈఈ ప్రసాద్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు.
ఆస్పత్రుల నిర్మాణ పనుల్లో జాప్యం వద్దు
కలెక్టర్ రాహుల్‌శర్మ