
నాగలగాని దేవేంద్ర
నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లు రెండే..
జిల్లాకు మంజూరైనవి 3,798
మంజూరులో ఆలస్యం..
లోకేషన్ ఇబ్బందులే ప్రధాన కారణం
స్లాబ్ లెవల్‌కు చేరుకున్న ఈ ఇంటి లబ్ధిదారురాలు పేరు నాగలగాని దేవేంద్ర. కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన ఈమెకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా సుమారు మూడు నెలల కాల వ్యవధిలో బేస్‌మెంట్, స్లాబ్ లెవల్ వరకు గోడల నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు ఆమెకు కేవలం రూ. లక్ష బిల్లు మాత్రమే ప్రభుత్వం నుంచి మంజూరైంది. దీంతో చేసేది లేక ఆమె ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసింది. ప్రభుత్వ బిల్లులు మంజూరు చేస్తే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటానని వెల్లడించింది.
భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే జిల్లాలో మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. మంజూరులో ఆలస్యం కావడం, లోకేషన్ ఇబ్బందులే నిర్మాణాల ఆలస్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
పూర్తయింది రెండే ఇళ్లు..
జిల్లాలోని 12 మండలాలకు 3,798 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,501 ఇళ్లకు ముగ్గుపోయగా, బేస్‌మెంట్ లెవల్‌లో 1,137, స్లాబ్ లెవల్‌లో 103, స్లాబ్ లెవల్‌లో గోడలు పూర్తయినవి 55, పూర్తయిన ఇళ్లు రెండు మాత్రమే ఉన్నాయి. మరో రెండు నెలలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడితే స్లాబ్ లెవల్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంజూరు, ఆన్‌లైన్ ఇబ్బందులు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టగా జిల్లాలో భూమి ఉండి ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితంగా జిల్లాకు 3,798 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు కేవలం రెండు ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. సర్కారు నిర్ధేషించిన సమయంలో ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు పోయలేకపోవడం, వివిధ కారణాలతో ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం జరుగుతోంది. ఇళ్లు మంజూరై పనులు చేపడుతున్న క్రమంలో లొకేషన్ సరిగా లేక ఆన్‌లైన్‌లో చూపించడం లేదు. దీంతో బిల్లులు రాక లబ్ధిదారులు నిర్మాణాలను నిలిపివేసి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న అనంతరం అధికారులు ఆన్‌లైన్‌లో వివరాలను తప్పుగా ఎంట్రీ చేసినందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.