
కోలిండియా స్థాయిలో రాణించాలి
● ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి క్రీడాకారులు కోలిండియా స్థాయిలో ప్రతిభ కనబర్చి రాణించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి కోరారు. సింగరేణి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం భూపాలపల్లి– రామగుండం–3 ఏరియాల బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ రీజినల్ పోటీలను ఏరియాలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. క్రీడలు సింగరేణి సంస్థలో ప్రతి ఒక్కరిలో ఒక సెలబ్రేషన్‌లాగా నిలుస్తాయన్నారు. క్రీడలు మనందరిలో మానసికోల్లాసం, సానుకూలతను నింపుతాయని సూచించారు. మహిళా ఉద్యోగులు సైతం క్రీడల్లో రాణించాలని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాల్లో గణనీయంగా మహిళా ఆఫీసర్లు నియమితులయ్యారన్నారు. సింగరేణి సంస్థలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ క్రీడలను నిర్వహించడం ఆనందకరమన్నారు. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడలు రోజు వారి మన కార్యకలాపాలలో భాగం చేసుకోవాలని సూచించారు. మనం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, పాల్గొనే ఉద్యోగులకు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్‌కుమార్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, అర్జీ–3 స్పోర్ట్స్ కోఆర్డినేటర్, అంజయ్య, అఽధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.