
మద్యం టెండర్లకు కసరత్తు
రిజర్వేషన్లు యథాతథం..
దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు
ఉమ్మడి వరంగల్‌లో 294 దుకాణాలు
ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల వారీగా మద్యం దుకాణాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: వైన్స్ (ఏ4)లకు 2025–27 సంవత్సరాలకు సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వాస్తవానికి నవంబర్ నెలాఖరుతో గడువు ముగియనుండగా.. ఒక నెల ముందుగానే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే వైన్స్‌ల టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి వస్తున్నప్పటికీ అక్టోబర్‌లో టెండర్లు నిర్వహించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్లతో ఇటీవల హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు.
డిసెంబర్ 1 నుంచే కొత్త దుకాణాలు
ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా 2023–25 ఎకై ్సజ్ పాలసీనే అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈసారి కూడా ఆరు స్లాబుల విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలిసింది. గతంలో 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. 5 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల్లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల్లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ఈసారి కూడా అదే పాలసీ అమలు చేయనుండడంతో ఎప్పటిలాగే టెండర్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాగా, డిసెంబర్ ఒకటి నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీ అమలుల్లోకి రానుండగా.. గతంలో మాదిరిగానే దుకాణాలకు సంబంధించి మూడు సామాజికవర్గాల (గౌడ, ఎస్సీ, ఎస్టీ) వ్యాపారులకు 30 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈసారి మద్యం దుకాణాల టెండర్లు పోటాపోటీగా సాగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ–జాతరతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్నాయన్న చర్చ ఇప్పటికే సాగుతోంది.
జిల్లా వైన్స్‌లు
హనుమకొండ 65
వరంగల్ 63
జనగామ 47
మహబూబాబాద్ 59
జేఎస్ భూపాలపల్లి,
ములుగు 60
మొత్తం 294
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు యథాతథంగా అమలు కానున్నట్లు, ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. టెండర్లు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించేలా జిల్లాల వారీగా మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో 2021–23 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్‌లో 294 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పాటించనున్నారు. ఈలెక్కన ఉమ్మడి వరంగల్‌లో 15 శాతం రిజర్వేషన్ల కింద గౌడ సామాజికవర్గానికి 39 నుంచి 44 దుకాణాలు రానున్నాయంటున్నారు. ఎస్సీలకు 27 లేదా 29, ఎస్టీలకు 13 నుంచి 15 దుకాణాలు కేటాయించనున్నారు. సుమారు 206 నుంచి 215 మద్యం దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించే అవకాశం ఉండగా.. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలు పాల్గొనే వీలుంటుంది. కాగా, ఈసారి కూడా 2011 జనాభా ప్రకారమే షాపులు కేటాయించనుండగా, స్లాబ్‌ల విధానం కూడా గత పాలసీ ప్రకారమే కొనసాగించనున్నారు. అయితే గతంలో టెండర్ దరఖాస్తు ధర రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు.
దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంపు
త్వరలో టెండర్ తేదీల ప్రకటన
డీసీ కార్యాలయాలకు అందిన
మార్గదర్శకాలు