
నూరు శాతం హాజరు ఉండాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల యూ–డైస్ నమోదు, విద్యార్థులు, సిబ్బంది ముఖ గుర్తింపు హాజరు నమోదు నూరు శాతం అమలు కావాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యార్థుల వివరాలు యూ–డైస్‌లో నమోదు, ముఖ గుర్తింపు ద్వారా విద్యార్థులు, సిబ్బంది హాజరు నమోదు, అడ్మిషన్ల పురోగతి, ఉత్తమ ఫలితాల సాధన, సౌకర్యాల కల్పన వంటి అంశాలపై డీఈఓ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సంక్షేమ అధికారులు, మోడల్ ఇంటర్ కళాశాలల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి హాజరు, ప్రతి ఉపాధ్యాయుడి సమయపాలన పారదర్శకంగా నమోదు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ముఖ గుర్తింపు నమోదును నూరు శాతం పూర్తి చేయాలని స్పష్టంచేశారు. ముఖ గుర్తింపు ప్రక్రియతో విద్యార్థుల, సిబ్బంది హాజరు నమోదులో పారదర్శకత ఉంటుందన్నారు. ఇంటర్‌లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత, నూరు శాతం ఫలితాలు సాధించాలని చెప్పారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కల్పనలో భాగంగా లెక్చరర్లు ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధనకు కృషి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 34 జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,644 మంది, ఇంటర్ రెండో సంవత్సరంలో 1,566 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకన్న, డీఈఓ రాజేందర్, అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, మోడల్ కళాశాలల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
గోదావరి పుష్కరాల
విజయవంతానికి ప్రణాళిక
గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో గోదావరి పుష్కరాల నిర్వహణకు శాఖల వారిగా చేయాల్సిన ఏర్పాట్లుపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2027 సంవత్సరంలో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలిరానున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్, శానిటేషన్, వైద్య, రవాణా, భద్రత తదితర సౌకర్యాలను సమగ్రంగా కల్పించాల్సిన అవసరం ఉన్నందున రానున్న మూడు రోజుల్లో చేపట్టాల్సిన పనులపై అంచనా నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజాకవి కాళోజీ
సాహిత్యం ద్వారా సమాజ మార్పునకు కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. మంగళవారం కాళోజీ జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించగా కలెక్టర్ రాహుల్‌శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కాళోజీ రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని, ఆయన జీవితం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. తన కవిత్వం ద్వారా స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి, తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహాకవి కాళోజీ నారాయణరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించాలి
కలెక్టర్ రాహుల్‌శర్మ

నూరు శాతం హాజరు ఉండాలి