
లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 13వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ ఆదాలత్‌లో కేసులను పెద్దఎత్తున పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్‌బాబు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా పోలీస్ అధికారులతో జడ్జి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే కేసులకు రాజీ కుదుర్చాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ జడ్జిలు నాగరాజు, దిలీప్‌కుమార్, అఖిల, పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
అధ్యాపకుల నిరసన
భూపాలపల్లి అర్బన్: మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం పాఠశాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. రాబోయే దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని వేతనాలు చెల్లించాలని ఉపాధ్యాయులు, సిబ్బంది కోరారు.
‘సీఐని సస్పెండ్ చేయాలి’
భూపాలపల్లి రూరల్: శాంతియుతంగా నిరసన చేపట్టిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసిన భూపాలపల్లి సీఐ నరేష్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఐపై ఎస్సీ, ఎస్టీ అట్రా సిటి కేసు నమోదు చేయాలన్నారు. సీఐపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొల్లిబాబు మాదిగ, నోముల శ్రీనివాస్, తూటిచర్ల దుర్గయ్య, అంతడుపుల సురేష్ మాదిగ పాల్గొన్నారు.
పూజారుల అభిప్రాయం మేరకే గద్దెల మార్పు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను పూజారుల అభిప్రాయాల మేరకే మార్పు చేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు చందా రఘుపతి, కొక్కెర రమేష్, కాక సారయ్య, కాక వెంకటేశ్వర్లు, దబ్బగట్ల గోవర్ధన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమ్మక్క– సారలమ్మల గద్దెలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను భక్తులు దర్శించుకునే సమయంలో ఎదురుపడి ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. జంపన్నవాగు నుంచి వచ్చే భక్తులు టీటీడీ కల్యాణ మండపం వెనుకాల క్యూలైన్, ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులు మీడియా పాయింట్ సమీపంలోని ఎంట్రెన్స్ ద్వారం నుంచి ఒక్కసారిగా భక్తులు గద్దెల ప్రాంగణంలోకి రావడంతో తొక్కిసలాట జరిగి ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రెండు గద్దెలను మార్పు చేయాలని ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలలను ముట్టుకోకుండా గద్దెల స్థానం మార్పు అనేది పూర్తిగా పూజారుల అనుమతి, అంగీకారాలతోనే పున:ప్రతిష్ట ఆదివాసీ ఆచార, సంస్కృతి సంప్రదాయాల ప్రకారం సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారులతో జరుగుతుందని వివరించారు. ఆదివాసీ కులసంఘాలు, ఆదివాసీ ఉద్యోగ సంఘాలు, ఆదివాసీయేతర కులసంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న మంచి కార్యక్రమాన్ని రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, మేడారం గ్రామాల మధ్య సుమారుగా 52 ఎకరాల భూమిని 1995లో దేవస్థానానికి ఈనాం భూమిగా ప్రకటించి ఇచ్చారని తెలిపారు. భూమిని ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకుంటూ పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించాలి

లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించాలి