
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్నిర్మాణంలో వేగం పెంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. మంగళవారం హనుమకొండ అదాలత్ కూడలిలోని రాచకొండ ప్రవీణ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల వివక్షకు గురికాగా, స్వరాష్ట్రంలో కల్వకుంట్ల పాలకుల కుటుంబ ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లాను ముక్కలు చెక్కలు చేసి తీవ్ర విధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన మేరకు వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.6,000ల కోట్ల అభివృద్ధి నిధులను సమకూర్చి అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్‌పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కోఆర్డినేటర్ సోమ రామమూర్తి, ఆయా సంఘాల నాయకులు రాచకొండ ప్రవీణ్, సోమిడి శ్రీనివాస్, చాపర్తి కుమార్ గాడ్గే, సోయం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల వేదిక
రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ