
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ములుగు/వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: ములుగు జిల్లా కేంద్రంలోని అంతర్గత రోడ్లు, గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి నుంచి మదనపల్లి వరకు రూ.4 కోట్లతో విస్తరించనున్న రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులను కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడమే కాకుండా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రహదారులను విస్తరించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో మహిళా శక్తి పథకం ద్వారా ఇద్దరు మహిళలకు రూ.10లక్షల విలువ చేసే మొబైల్ ఫిష్ ఔట్లేట్ వాహనాలను సీతక్క అందజేశారు. ర్యాంప్ ఉమెన్ ఆక్సెలేరేషన్ ప్రోగ్రాంపై అవగాహన సదస్సు నిర్వహించగా సీతక్క హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషన్ సంపత్, జిల్లా మత్స్యశాఖ అధికారి సల్మాన్‌రాజ్ పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క