
సొంతింటి పథకంపై క్యాంపెయిన్
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బ్యాలెట్ ఓటింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ కోరారు. సోమవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం స్థానిక యూనియన్ కార్యాలయంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సొంతింటి కల నెరవేర్చాలని ఈ నెల 11, 12వ తేదీల్లో బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్మికుల సమస్యలపై 15వ తేదీన జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులు సంఘాలకతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి ప్రతి ఏడాది డివిడెంట్ల రూపంలో వేల కోట్ల రూపాయలు కార్మికుల సొమ్మును చెల్లిస్తుందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. లాభాల వాటా 35శాతం ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి 250 గజాల ఇంటి స్థలం, రూ.25లక్షలు వడ్డీ లేని రుణం చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సింగరేణి ఆస్తులను అనేక రకాలుగా వాడుకుంటున్నారని, ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణిలో అవినీతిని నిర్మూలించి పారదర్శకతను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంపేటి రాజయ్య, రమేష్, రజాక్ పాల్గొన్నారు.