
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం
హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలి...
భూపాలపల్లి: ప్రజలు తగు జాగ్రత్తలు పాటించి ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. నేడు (శుక్రవారం) జరుగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు చెరువుల వద్దకు వెళ్లవద్దన్నారు. విగ్రహాలు విద్యుత్ తీగలకు తాకకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
మరమ్మతులు చేపట్టాలి..
వర్షాలు, వరదల వలన దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మతులు చేపట్టి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దెబ్బతిన్న వనరుల పునరుద్ధరణకు విభాగాల వారిగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ శ్వేత, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిధులు సమర్థవంతంగా వినియోగించాలి..
జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా మినరల్ డెవలప్‌మెంట్ నిధులు సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డీఎంఎఫ్‌టీ మేనేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పారిశ్రామికీకరణ వలన ప్రభావితం అవుతున్న ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని నిధులు వినియోగించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సీపీఓ బాబూరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు..
జిల్లాలోని ఉపాధ్యాయులకు కలెక్టర్ రాహుల్ శర్మ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.
జిల్లా నుంచి గ్రామ పాలన అధికారులుగా ఎంపికై న అభ్యర్థులు సీఎం చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు స్వీకరించేందుకు హైదరాబాద్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఈ విషయమై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి మొత్తం 107 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు.
ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి
దెబ్బతిన్న రహదారులను
మరమ్మతు చేయాలి
కలెక్టర్ రాహుల్ శర్మ