
గురుభ్యోనమః
జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు విద్యార్థులకు సొంత ఖర్చులతో వాహన సదుపాయం ఏర్పాటుచేస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తూ వెలుగులు నింపుతున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వినూత్నంగా బోధన చేస్తున్న ఉపాధ్యాయులపై సాక్షి ప్రత్యేక కథనం..
కాళేశ్వరం: కనుబొమ్మలతో మాట్లాడే లిపిని మహదేవపూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాద్యాయుడు మడక మధు కనుగొని విద్యార్థులతో అలవోకగా చెప్పిస్తూ శిక్షణ ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలోకి దింపుతున్నారు. పాఠశాల 8వ తరగతి విద్యార్థులు చేసిన ఐబ్రో కోడింగ్ ద్వారా మాటలు, పాటలు లేదా సంకేత భాషలు అవసరం లేకుండా కేవలం కనుబొమ్మల కదలికలతో ఒకరు రాసిన వాక్యాన్ని మరో విద్యార్థి కనుబొమ్మల ద్వారా గ్రహించి ఖచ్చితంగా చెప్పగలగడం ఈ ఐబ్రో కోడింగ్ ఉద్దేశం. గతంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద మన్ననలు పొందారు. ప్రస్తుత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కలెక్టర్ రాహుల్‌శర్మ ఇటీవల ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.