
విద్యార్థులకు సమస్యలు లేకుండా చూసుకోవాలి
కాటారం(మహాముత్తారం): గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ అన్నారు. మహాముత్తారం మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం, జెడ్పీహైస్కూల్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. హాస్టల్‌లో సౌకర్యాలు పరిశీలించి స్టాక్ వివరాలను వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం జెడ్పీహైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు తెలుసుకొని సౌకర్యాలు, విద్యాబోధనపై సబ్ కలెక్టర్ ఆరా తీశారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.
పారదర్శకత పాటించాలి
రైతులకు యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ సూచించారు. మహాముత్తారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా పంపిణీ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. యూరియా స్టాక్, రిజిస్టర్లు పరిశీలించారు. పంపిణీలో పారదర్శకత పాటించాలని సబ్ కలెక్టర్ పీఏసీఎస్ అధికారులను ఆదేశించారు.
కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్