
తేనెటీగల పెంపకం ద్వారా ఉపాధి
భూపాలపల్లి అర్బన్: తేనెటీగల పెంపకం ద్వారా సింగరేణి ప్రభావిత ప్రాంతాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఏరియాలోని ఓపెన్ కాస్టు ప్రభావిత గ్రామమైన గడ్డిగానిపల్లిలో తేనెటీగల పెంపకం, శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తేనెటీగల పెంపకం, శిక్షణ కోసం రూ.74,86,500 సింగరేణి సంస్థ కేటాయించినట్లు చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా మూడు ఏరియాలలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. భూపాలపల్లి ఏరియాకు రూ.24లక్షలు కేటాయించినట్లు తెలిపారు. మనబ్ కల్యాణ్ వెల్ఫేర్ సొసైటీ (ఎన్‌జీఓ) ఆధ్వర్యంలో పెంపకంపై ఒక వారం పాటు శిక్షణ సుమారు 100 మంది మహిళలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సింగరేణి సంస్థ స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ద్వారా చదువుకున్న వారికి 36 రకాల ఉచిత కోర్సులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఽధికారులు పోషమల్లు, మారుతి, శ్యాంసుందర్, రమాకాంద్, కృష్ణయ్య, శ్రీను, ప్రశాంత్, రాజ్‌వాలియా, కార్మిక సంఘాల నాయకులు రమేష్ పాల్గొన్నారు.