టేకుమట్ల: ఉద్యమ నేలలో మరో గాయని శ్రీహర్షిణి వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ అన్నారు. వెలిశాలలో యువ రచయిత శ్రీపతి రాము రచనలో వెలిశాలకు చెందిన గందం శ్రీహర్షిణి పాడిన ‘ఏ దారినా మీరొస్తరో అన్నలు, ఏ తొవ్వలో ఎదురైతరో మా అక్కలు.. ఎరుపెక్కిన చుక్కలు’అనే ఉద్యమ గీతాన్ని ఆదివారం విడుదల చేసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ రచయితలకు వెలిశాల మట్టి త్యాగాలను అవసరాలను గుర్తు చేస్తాయని అన్నారు. శ్రీహర్షిణి ఆలపించిన ఉద్యమ గీతం ఏ ఒక్కరికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని అన్నారు. ఉద్యమాల్లో పాల్గొని ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడి వీరమరణం పొందిన ఉద్యమ నేతల స్ఫూర్తిని గుర్తుచేసే గీతమన్నారు. చిన్న వయస్సులోనే గొప్ప గాత్రంతోనే కాకుండా రచయితగా హర్షిణి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం గీత రచయిత రాము మాట్లాడుతూ వెలిశాల ఉద్యమ నేపథ్యంపై ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమ గీతాలను రాశానని, భవిష్యత్‌లో సైతం మరిన్ని చైతన్య గీతాలను అందిస్తానని అన్నారు. అనంతరం గీత రచయిత, గాయనిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతలపెల్లి స్వామిరావు, మహేందర్, లింగస్వామి, డప్పు సత్తి, అందె కుమార్, గందం సురేష్, రాజేందర్, శ్రీకాంత్, బన్నీ, కిరణ్‌గౌడ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్