
గంజాయి స్వాధీనం
మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జంగిడిపల్లి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కొయ్యూరు పోలీస్‌స్టేషన్‌లో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఎడ్లపల్లి గ్రామం జంగడిపల్లిలో శనివారం వాహన తనిఖీ చేస్తున్న క్రమంలో బైక్‌లపై నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినట్లు డీఎస్పీ తెలిపారు. వారిని తనిఖీ చేయగా 3.335 కిలోల గంజాయి దొరికిందన్నారు. పెద్దపల్లి జిల్లా 8వ కాలనీకి చెందిన రోహిత్, బాలజీ, రిత్విక్, ఒడిశా గ్రామానికి చెందిన బుజ్జి ఒడిశా నుంచి 8వ కాలనీకి గంజాయి తరలిస్తున్నట్లు చెప్పారు. గంజాయి విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందన్నారు. వీరి వద్ద నుంచి రెండు బైకులు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సైలు నరేష్, రజన్‌కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.