
పురుగుల పాలు
భూపాలపల్లి: రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, అంతకుముందు నిల్వ ఉన్న దొడ్డు బియ్యం విషయంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఫలితంగా డీలర్లు, గోదాముల్లో ఉన్న బియ్యం చెడిపోతున్నాయి. బియ్యం పురుగులు, ఎలుకలు, పందికొక్కుల పాలవుతున్నాయి.
ఐదు నెలలుగా వృథాగా..
రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోంది. అంతకుముందు ఎంఎల్‌ఎస్ పాయింట్లు, బఫర్ గోదాంలలో భారీ మొత్తంలో దొడ్డు బియ్యాన్ని నిల్వచేశారు. రేషన్‌డీలర్ల వద్ద సైతం మిగిలిన బియ్యం (క్లోజింగ్ బ్యాలన్స్) నిల్వలు ఉన్నాయి. ఈ బియ్యాన్ని ఏం చేయాలనే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. దీంతో జిల్లాకు సంబంధించిన దొడ్డు బియ్యం వరంగల్‌లోని బఫర్ గోదాంలో 800 మెట్రిక్ టన్నులు, డీలర్ల వద్ద 355, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో 80 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి.
పనికి రాకుండా పోయిన బియ్యం..
మార్చి నెలలో నిల్వచేసిన దొడ్డు బియ్యంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో పనికి రాకుండా పోతున్నాయి. గోదాములు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బియ్యం పురుగులు పట్టడమే కాక, పందికొక్కులు, ఎలుకల పాలవుతున్నాయి. బస్తాలు చిరిగిపోయి వృథాగా పోవడమే కాకుండా బియ్యం రంగు మారుతోంది. దీంతో రైస్‌మిల్లర్లు, ఇతర వ్యాపారులు కొనే పరిస్థితి కనిపించడం లేదు. పశువుల దాణాకు మినహా దేనికీ ఉపయోగపడే అవకాశం లేదు. జిల్లాకు సంబంధించిన దొడ్డు బియ్యం 1,235 మెట్రిక్ టన్నులు నిల్వ ఉండగా, దాని విలువ సుమారు రూ.3.58 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పుడు ఆ బియ్యాన్ని ప్రభుత్వం విక్రయించినా పావలా వంతు ధర కూడా రాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ.కోట్లు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రేషన్‌డీలర్ల ఇబ్బందులు..
జిల్లాలోని 12 మండలాల్లో 277 రేషన్‌షాపులు ఉన్నాయి. సగటున ఒక్కో షాపులో సుమారు 10టన్నుల నుంచి 12 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో షాపులు చిన్నగా ఉండటంతో దొడ్డు బియ్యం నిల్వలతో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న షాపుల్లో ఇప్పటికే బియ్యం పందికొక్కులు, ఎలుకలు, పురుగుల పాలైందని పలువురు డీలర్లు వాపోతున్నారు. బియ్యం బస్తాలను ఎలుకలు చింపి చిందరవందర చేశాయని వెల్లడించారు. దొడ్డు బియ్యం మూలంగా సన్నబియ్యం కూడా పాడయ్యే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దొడ్డు బియ్యాన్ని షాపుల నుంచి తరలించాలని డీలర్లు కోరుతున్నారు.
మార్గదర్శకాల మేరకు నిర్ణయం..
గోదాములు, రేషన్‌డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలూ రాలేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే నిర్ణయం తీసుకుంటాం.
– కిరణ్‌కుమార్, డీసీఎస్‌ఓ
బఫర్ గోదాంలో 800
డీలర్ల వద్ద 355
ఎఎంల్‌ఎస్ పాయింట్లలో 80
నిల్వ ఉన్న బియ్యం 1,235
విలువ రూ. 3.58 కోట్లు
జిల్లాలో భారీగా దొడ్డు బియ్యం నిల్వలు
గోదాంలు, డీలర్ల వద్ద
1,235 మెట్రిక్ టన్నులు
విలువ రూ.3.58 కోట్లు
ఐదు నెలలుగా నిర్ణయం తీసుకోని సర్కారు