
ఏటా భారంగా..
అమాంతం పెరిగిన రేట్లు..
కూలీల కొరతతో అన్నదాతల అవస్థలు
భూపాలపల్లి రూరల్: వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతోంది. ఆరుగాలం కష్టపడే రైతన్నలకు ఏటా కష్టాలు తప్పటం లేదు. అతివృష్టి, అనావృష్టితో పాటు కూలీల కొరత, పెరిగిన ఎరువుల ధరలతో పాటు యాంత్రీకరణలో వెనుకంజతో సాగు చేయాలంటేనే అన్నదాతలు ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లను పెంచుతుండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తప్పని పరిస్థితుల్లో బతుకుదెరువు కోసం సాగు ఊబిలో దిగి అష్టకష్టాలు పడుతున్నారు.
వరి, పత్తికి ప్రాధాన్యం..
మండలంలోని చెరువులు, కాలువలు, బోరుబావుల కింద వరి సాగుతో పాటు పత్తి, మిర్చి, మొక్క జొన్న ఇతర పంటలను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్న కొద్దిపాటి భూములను ఎవరికి వారు సాగు చేస్తుండటంతో కూలీల కొరత అధికమైంది. జిల్లాలో వరి 87,500 ఎకరాలు, పత్తి 98,500 ఎకరాల్లో సాగు చేశారు. మిర్చి 24వేల ఎకరాలకు నారు పోసుకున్నారు. ఎకరం భూమిలో దుక్కులు దున్నటం, నాట్లు వేయటం మందు చల్లటం వంటి పనులు చేయాలంటే సుమారు 12 మంది కూలీలు అవసరం ఉంటుంది. ఇక పత్తి, మిర్చి పంటల్లో 20 మంది వరకు కూలీలు అవసరముంటుంది. కానీ ఎవరి పొలాలను వాళ్లు సాగు చేస్తుండటంతో కూలీల కొరత అధికంగా ఉంది. దీంతో పరిసర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
అందుబాటులో లేని యంత్రాలు
వరిసాగుకు ఒక్క ట్రాక్టర్ తప్పా ఇతర యంత్రాలు ఏవీ అందుబాటులో లేవు. కొన్నిచోట్ల గొర్రు ట్రాక్టర్‌తో వేస్తున్నా.. అందుబాటులో లేనివారు ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు వేసే యంత్రాలు మార్కెట్‌లోకి వచ్చినా స్థానికంగా ఇంకా వాడకంలోకి రాలేదు. దీంతో కూలీల వినియోగం తప్పనిసరి అయింది. అచ్చులు, గొర్రు, నాటు వేయడం అన్నింటికీ కూలీల డిమాండ్ బాగా పెరిగింది. ఎరువుల ధరలు కూడా దాదాపు బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకు పెరగడంతో రైతులపై అదనపు భారం పడుతోంది.
మారుతున్న కాలంలో పాటు, పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూలీల కొరత ఉండటం వలన కూలీ రేట్లను అమాంతంగా పెంచేశారు. దీంతో రైతులు పరిసర గ్రామాల నుంచి కూలీలను అడిగినంత కూలీ చెల్లిస్తూ ప్రత్యేక వాహనాల్లో తీసుకురావాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. గతేడాది మహిళలకు కూలి రూ.250 వరకు ఉండేది. కానీ ఈ ఏడాది రూ.400నుంచి రూ.500 వరకు పెరిగింది. పురుషులకు రూ.500 నుంచి రూ.900 వరకు చెల్లించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
కూలీ రేట్లకు రెక్కలు..
అమాంతం పెరుగుదల
రూ.800 వరకు డిమాండ్
ఇబ్బందులు పడుతున్న రైతులు

ఏటా భారంగా..

ఏటా భారంగా..