
సాదాబైనామాలకు మోక్షం
జిల్లాలో 51,347 దరఖాస్తులు
భూపాలపల్లి అర్బన్: తెల్లకాగితంపై లిఖితపూర్వక ఒప్పందాలతో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్లకు అడ్డంకి తొలగడంతో వేలాది మంది రైతులకు మేలు జరగనుంది. ప్రభుత్వం 2020 అక్టోబరు 12న జారీ చేసిన జీఓ నంబరు 112ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 26న తీర్పు వెల్లడిస్తూ సన్న, చిన్నకారు రైతులకు తీపికబురు అందించింది. 2014 జూన్ 2కు ముందు తమ ఆధీనంలో ఉన్నట్లు చూపిన సన్నకారు రైతులకు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. 2020 అక్టోబరు నుంచి 2020 నవంబరు 10 వరకు తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుబుక్స్ చట్టం–1971 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి సుమారుగా ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్‌ఓఆర్ చట్టంతో..
గ్రామీణ ప్రాంతాల్లో కొన్నేళ్ల కిందట సాదా కాగితంపై భూమి కొనుగోలు చేసి రాయించుకున్న వారిలో అనేకమంది పేర్లు మార్చుకొని పట్టాలు చేసుకోలేదు. ధరణికి ముందున్న ఆర్‌ఓఆర్ చట్టంలో సాదాబైనామాలతో పట్టాలు చేశారు. ధరణి వచ్చిన తర్వాత అవి ఆగిపోయాయి. వాటిని అమలు చేసేందుకు గత ప్రభుత్వం సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. 2014 జూన్ 2లోగా లిఖితపూర్వక ఒప్పందంతో భూములు కొన్న రైతుల దరఖాస్తులకు చట్టబద్ధత కల్పించి పాసుపుస్తకాలు జారీచేయాలని భావించింది. 2020 అక్టోబరులో ప్రకటన వెలువరించి నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. జిల్లాలో 51,347 మంది దరఖాస్తు చేసుకున్నారు.
క్రమబద్ధీకరణకు అనుమతిచ్చిన కోర్టు
‘భూభారతి’ ద్వారా పట్టాలు
సన్న, చిన్నకారు రైతులకు మేలు