
క్రీడలతో ఐకమత్యం
భూపాలపల్లి రూరల్: క్రీడలు ఐకమత్యాన్ని చాటడమే కాక ఆరోగ్య, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ క్రీడా దినోత్సవ ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సైతం ప్రాధాన్యత కల్పిస్తూ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం నిర్మాణానికి రూ.6కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మండల కేంద్రాలలో కూడా క్రీడా మైదానాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. క్రీడాకారులు క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా క్రీడలు, యువజన సర్వీసులు శాఖ అధికారి రఘు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ ఎల్.జైపాల్, క్రీడాకారులు, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు