
రోగులకు సకాలంలో వైద్యం అందించాలి
కాటారం: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. కాటారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పరిశుభ్రత, సౌకర్యాలు, మందులు, వైద్య సిబ్బంది హాజరు పట్టిక, ఓపీ రికార్డులు, ల్యాబ్, ఫార్మసీ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉండాలని.. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహనలు కల్పించాలని సూచించారు. ముందస్తు చర్యలు, జాగ్రత్తలను వివరించాలని తెలిపారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి అవసరమైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ సిబ్బందిని హెచ్చరించారు. డీఎంహెచ్‌ఓ వెంట జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్, మండల వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక, సిబ్బంది ఉన్నారు.
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
డాక్టర్ మధుసూదన్