
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
భూపాలపల్లి: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్, విచారణలో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ పోలీసు అధికారి క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి ప్రజల విశ్వాసం పొందాలన్నారు. మహిళల భద్రత, పిల్లల రక్షణ, అక్రమ రవాణా, సైబర్ నేరాలు, రౌడీషీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాత్రి పహారా తప్పకుండా జరగాలని, ఇంటిలిజెన్స్ పెంచడం, కొత్తగా వెలుగులోకి వస్తున్న నేర ధోరణులను క్షుణ్ణంగా గమనించి తగు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే