
మునిగిన పంటలు
జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం
భూపాలపల్లి: జిల్లాలో రెండు రోజుల పాటు ఎడతెరపి లేని మోస్తారు వర్షం కురిసింది. వర్షం, వరద నీటి రాకతో మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఇరువైపుల ఒడ్డున గల వేలాది ఎకరాల వరిపంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో సైతం పంటలు నీట మునిగాయి. వర్షం కారణంగా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
నీటిపాలైన పంటపొలాలు..
జిల్లాలో మంగళవారం, బుధవారం ఎడతెరపి లేని వర్షం కురిసింది. బుధవారం గణపురం మండలంలో 98.4, రేగొండలో 81.0, మొగుళ్లపల్లిలో 72.0, మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. గణపురం, భూపాలపల్లి మండలంలో కురిసిన వర్షానికి వరద నీరు భారీగా రావడంతో మోరంచవాగు మరోమారు తన ఉగ్రరూపాన్ని చూపింది. వాగు ఇరువైపులా సుమారు అరకిలో మీటరు దూరం వరకు వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆ రెండు మండలాల్లోని సుమారు రెండు వేల ఎకరాల వరిపంట పూర్తిగా నీట మునిగింది. గురువారం వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా వరద నీరు పోలేదు. వరద కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేస్తాయని, ఇక పంట సాగు చేయలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగొండలో సైతం ఎడతెరపి లేని వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోని వరిపంటలు పూర్తిగా జలమయమయ్యాయి. పలువురు రైతులు మిర్చి సాగు ఇంకా ప్రారంభించకపోగా, మడుల్లో ఉన్న నారు పూర్తిగా మునిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వర్షం కురిస్తే పత్తి, మిర్చి, వరి పంటలను వదులుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు.
బొగ్గు ఉత్పత్తికి ఆటంకం...
వర్షం కారణంగా బుధవారం సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలి చిపోయింది. మల్హర్ మండలంలోని తాడిచర్ల ఓపె న్‌కాస్ట్‌లో ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, భూపాలపల్లి ఏరియాలో మంగళవారం, బుధవారం కురిసిన వర్షానికి ఓపెన్‌కాస్ట్ 2, 3 ప్రాజెక్టుల్లో 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖల అధికారులతో గురువారం ఐడీఓసీలో సమావేశమై పలు సూచనలు చేశారు. మొరంచవాగు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక వద్ద ప్రవహిస్తోందని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 90306 32608కు కాల్ చేయాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారి తీస్తుందన్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న మోరంచవాగు
2వేల ఎకరాల వరిపంటకు నష్టం
నిండు కుండలా గణపసముద్రం
ఓపెన్‌కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి