
పేరుకే క్రీడా ప్రాంగణాలు
గ్రామాల్లో నిరుపయోగంగా ఆటస్థలాలు
కాళేశ్వరం: జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో ఏర్పాటుచేసిన క్రీడాప్రాంగణాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మండలానికో మినీ స్టేడియం ఏర్పాటు హామీ నేటికీ అమలుకాకపోవడంతో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆటలు ఆడుకునేందుకు సరైన సౌకర్యాలు లేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాకేంద్రంలో ఒకటే మైదానం..
జిల్లాలో 12 మండలాల్లో 248 పంచాయతీలు ఉన్నాయి. భూపాలపల్లి, రేగొండ, చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల, గణపురం, కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల, మల్హర్ మండలాలల్లో వాలీబాల్, కబడ్డీ, షటిల్, ఖోఖో, క్రికెట్ క్రీడాకారులు చాలామంది ఉన్నారు. సరైన వసతులు గల మైదానం లేకపోవడంతో ఆటకు దూరమవుతున్నారు. జిల్లాకేంద్రంలో సింగరేణి సంస్థకు చెందిన మైదానం మాత్రమే ఉంది. ఆటస్థలాలు లేక చెరువులు, కుంటలు, గల్లీల్లో చిన్న చిన్న ప్రాంతాల్లో ఆడుకుంటున్నారు.
క్రీడలతో ఆరోగ్యం..
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయి. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు ప్రశాంతత లభిస్తుంది. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించచ్చు. కానీ జిల్లావ్యాప్తంగా క్రీడామైదానాలు లేకపోవడంతో క్రీడాకారులకు శాపంగా మారింది.
మినీ స్టేడియాల ఏర్పాటులో జాప్యం
నష్టపోతున్న క్రీడాకారులు