
హత్యా.. ఆత్మహత్యా..
కాటారం: ఈనెల 3న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువత.. 25 రోజుల తర్వాత మృతదేహంగా లభ్యమైంది. ఘటనాస్థలంలో మృతదేహం పక్కన నిమ్మకాయలు, కుంకుమ ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా.. ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి(22) తండ్రి అనారోగ్యంతో రెండు నెలల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి వర్షిణి ఆవేదనతో ఉంది. ఈ నెల 3న తెల్లవారుజామున వర్షిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వర్షిణి తల్లి కవిత చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతం జాతీయ రహదారికి కొంత దూరంలో కుళ్లిన స్థితిలో గురువారం ఓ మృతదేహం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి(22)గా గుర్తించారు. చిట్యాల పోలీసులకు సమాచారం అందించడంతో మృతురాలి తల్లి కవిత ఘటనా స్థలానికి చేరుకొని తన కూతురిగా గుర్తించారు. మృతురాలి తల్లి కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
మేడిపల్లి సమీపంలో
యువతి మృతదేహం లభ్యం
ఘటనాస్థలంలో నిమ్మకాయలు,
కుంకుమ
ఈనెల 3న మిస్సింగ్ కేసు నమోదు