
సీటి, ఎంఆర్‌ఐ స్కానింగ్ ఏర్పాటు చేయాలి
● మాజీ ఎమ్మెల్యే
గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటి స్కానింగ్, ఎంఆర్‌ఐ సౌకర్యం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆయూష్ ఆస్పత్రి భవనం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులను పరిశీలించారు. మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆస్పత్రిలోని అన్ని వార్డులను తిరుగుతూ వైద్యసేవలు పొందుతున్న రోగులు, బాలింతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. విద్యార్థులకు సరైన హాస్టల్ వసతి కల్పించాలన్నారు. భవన నిర్మాణాలను వేగవంతంగా చేపట్టి పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఆయుష్ ఆస్పత్రిని ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సిబ్బందిని నియమించకుండా ఓపీ, ఐపీ సేవలు ప్రారంభించకపోవడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు జనార్దన్, సంపత్‌కుమార్, రఘుపతిరావు, సిద్దు, హరీశ్‌రెడ్డి, బీబీ చారి, అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు.