
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు
భూపాలపల్లి: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో రెవెన్యూ, టీజీఎండీసీ, ఇరిగేషన్, పోలీస్, రవాణా, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, భూగర్భజల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందిస్తున్నట్లు తెలిపారు. ఉచిత ఇసుక రవాణాలో అక్రమాలకు తావులేకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ఇసుక రీచ్‌లను గుర్తించి జియో ట్యాగింగ్ చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇసుక రీచ్‌ల అనుమతుల కోసం నివేదికలు అందించాలని చెప్పారు. అనంతరం ‘మన ఇసుక వాహనం’ మొబైల్ యాప్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి అవకాశాలు..
మహిళల ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం భూపాలపల్లి పట్టణంలోని సుభాష్‌కాలనీ సమ్మక్క సారక్క జిల్లా మహిళా సమాఖ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల అభివృద్ధికి ఫిష్ ఔట్‌లెట్, మహిళా శక్తి, బస్సులు, సౌరశక్తి ప్లాంట్ల ద్వారా విద్యుత్ సరఫరా, పెట్రోల్ బంకులు, వ్యవసాయ పనిముట్లు, పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ తయారీ, అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులు మొదలగు కార్యక్రమాలను మహిళా సంఘాల ద్వారా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి..
ప్రజావాణిలో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 63మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రజావాణి దరఖాస్తులతో పాటు ప్రజాభవన్, హైదరాబాద్ నుంచి వచ్చిన దరఖాస్తులు వచ్చే సోమవారంలోపు పరిష్కరించి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ