
ఎమ్మెల్యే సార్.. జరదేఖో
పరిష్కారం కాని చిట్యాల సివిల్ ఆస్పత్రి సమస్యలు
చిట్యాల: పూర్తిస్థాయిలో వైద్యుల్లేక పది నెలలుగా చిట్యాల సివిల్ ఆస్పత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులు ఇప్పటికీ తప్పడం లేదు. వైద్యులను నియమించి రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆస్పత్రిలో రెండు నెలల క్రితం సమీక్ష నిర్వహించి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. సార్ మా ఆస్పత్రి మారలే.. అంటున్నారు.
సమీక్షించి.. వదిలేశారు..
ఆస్పత్రిలో సమస్యలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మే 12వ తేదీన ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో సమస్యలు, వైద్యుల కొరత తదితర అంశాలను తెలుసుకున్నారు. త్వరితగతిన సమస్యలను పరిష్కరించి వైద్యులను నియమిస్తామని సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ఆస్పత్రిలో గైనకాలజిస్టులు లేకపోవడంతో ఆపరేషన్ల కోసం వాడే పరికరాలు అన్నీ పదినెలలుగా మూలకు పడ్డాయి. ఆస్పత్రిలో వెంటిలేటర్ లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులను ఎంజీఎంకు రెఫర్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా ఎమ్మెల్యే దృష్టి సారించి మూడు మండలాలకు పెద్దదిక్కుగా ఉన్న ఆస్పత్రిలోని సమస్యలను పరిష్కరించడంతో పాటు వైద్యులను నియమించాలని పలువురు కోరుతున్నారు.
అమలుకు నోచుకోని
ఎమ్మెల్యే గండ్ర హామీలు
ఎమ్మెల్యే సమీక్ష చేసినా ఫలితం శూన్యం
వైద్యుల్లేక రోగులకు తప్పని తిప్పలు
వైద్యుల కొరత..
చిట్యాల సివిల్ ఆస్పత్రి చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల ప్రజలకు పెద్దదిక్కుగా ఉంది. పది నెలలుగా గైనకాలజిస్ట్, పిల్లల వైద్యులు లేకపోవడంతో సేవలు అందడం లేదు. పది నెలలుగా గర్భిణులకు వైద్యసేవలు అందడం లేదు. నార్మల్ డెలివరీలు, ఆపరేషన్లు ఆస్పత్రిలో చేయడం లేదు. గర్భిణులను భూపాలపల్లి జిల్లా ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. దీంతో దూరం వెళ్లడానికి గర్భిణులు, కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎమ్మెల్యే సార్.. జరదేఖో