
ఎంజీఎంలో ఏసీబీ అధికారులు?
● ఉద్యోగుల విధులపై ఇంటెలిజెన్స్ నిఘా
● కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులపై
ప్రత్యేక దృష్టి
● వివాదాస్పదంగా మారుతున్న
టెండర్ నోటిఫికేషన్లు
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రికి ఏసీబీ అధికారులు నిత్యం వస్తూ వెళ్లడం ఇక్కడి అధికారులను భయాందోళనకు గురి చేస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు లక్షలాది రూపాయల విలువైన ఔషధాల కొనుగోళ్లతో పాటు కోట్లాది రూపాయల టెండర్ల బిల్లుల చెల్లింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో ఇటు ఇంటెలిజెన్స్ అధికారులు.. అటు ఏసీబీ అధికారులు ఎంజీఎం ఆస్పత్రిపై నజర్ వేశారు. కొంత మంది కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుండా అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో బిల్లుల చెల్లింపులో ఒత్తిళ్లు తెస్తుండడంతో అధికారులు చేసేదేమీ లేక కాంట్రాక్టర్లకు తలొగ్గుతున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. ఈక్రమంలో కాంట్రాక్టర్లు కాగితాలపై చూపే లెక్కలతో వారు అందించే అమ్యామ్యాలకు తలొగ్గుతూ కొన్ని నెలలుగా కోట్లాది రూపాయల బడ్జెట్‌ను విడుదల చేసినట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఈక్రమంలో ఎంజీఎంలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ అఽధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అధికారుల్లో చర్చ జరుగుతోంది..
గతంలోనూ ఏసీబీ దాడులు
ఎంజీఎం ఆస్పత్రిలో 2013లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రామకృష్ణను అప్పటి ఆక్సిజన్ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టించారు. అలాగే ఓ డైట్ కాంట్రాక్టర్ ఆస్పత్రి ఆర్‌ఎంఓను ప్రత్యక్ష నగదు అందిస్తూ ఏసీబీ అధికారులకు అప్పగించారు. అనంతరం కొన్నేళ్ల తర్వాత ఏసీబీ అఽధికారులు ఎంజీఎం ఆస్పత్రికి వస్తూ వెళ్తుండడం అందరినీ ఆలోచింపజేస్తోంది. గత నాలుగు, ఐదు నెలల్లో ఆస్పత్రిలో ఎలాంటి బిల్లులు చెల్లించారు? ఏయే కాంట్రాక్టర్‌కు ఎంత మేర బిల్లులు చెల్లించారు. ఈబిల్లుల చెల్లింపుల్లో నిబంధనలు పాటించారా? ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? అనే కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు సైతం ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే ఆస్పత్రిలో ఈ మధ్య కాలంలో చేపట్టిన కారుణ్య నియామకాల వ్యవహారంలో సైతం పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడుతున్నాయి.
వివాదాస్పదంగా మారుతున్న నోటిఫికేషన్లు
ఎంజీఎం ఆస్పత్రిలో గత కొన్ని నెలలుగా అధికారులు పిలుస్తున్న టెండర్ నోటిఫికేషన్లు, నియమాక నోటిఫికేషన్లపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతోంది. మార్చి 21న దంత వైద్యుల కోసం నోటిఫికేషన్ వెలువరించి ఇంత వరకూ నియామకాలు చేపట్టలేదు. అలాగే ఔషధాల కోసం పిలిచిన టెండర్ల నోటిఫికేషన్ సుమారు నెలలో పూర్తి చేయాల్సిన ప్రక్రియను 9 నెలలు గడిచినా పూర్తి చేయకపోవడంతో ఆ టెండర్‌ను రద్దు చేసి తిరిగి టెండర్లు పిలిచారు. ఎంజీఎం ఆస్పత్రిలో రెండో సారి పిలిచినా టెండర్లకు కాంట్రాక్టర్లకు ముందుకు రాకపోవడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. ఈక్రమంలో ఆస్పత్రిలో ప్రతీ టెండర్, బిల్లుల చెల్లింపులు వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు ఇంటెలిజెన్స్, ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.