
సమ్మెతో సింగరేణికే నష్టం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్వహించే సమ్మెతో సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సమ్మె నేపథ్యంలో శుక్రవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్మిక సంఘాలు అందజేసిన సమ్మె నోటీసులో పేర్కొన్న 15 డిమాండ్లు సింగరేణి పరిధిలో లేవని తెలిపారు. సమ్మెతో ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని, తద్వారా లాభాలు కూడా తగ్గుతాయని అన్నారు. సింగరేణి పరిధిలో లేని వాటికోసం ఉద్యోగులు సమ్మెలో పాల్గొనవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాటూరి రవీందర్, ఎర్రన్న జోతి, రవికుమార్, పోషమల్లు, ప్రసాద్, సురేఖ, మారుతి పాల్గొన్నారు.
పచ్చదనం కనిపించేలా..
పచ్చదనం కనబడేలా వృక్ష సంపదను వృద్ధి చేసేందుకు లక్షల మొక్కలు నాటుతున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. 76వ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏరియాలోని సుభాష్‌కాలనీ రామాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. ప్రజలందరూ మొక్కలు నాటి కన్న పిల్లల వలే బాధ్యతగా చూసుకోవాలన్నారు. నిడనిచ్చే చెట్లతో పాటు పండ్లనిచ్చే చెట్లను అధిక సంఖ్యలో పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, రవీందర్, పోషమల్లు, రవికుమార్, సురేఖ, రజిని, సైలెంద్రకుమార్ పాల్గొన్నారు.
సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి