
శాంతిభద్రతలే లక్ష్యంగా పని చేయాలి
టేకుమట్ల: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి సిబ్బంది పని తీరు, వారి సమస్యలపై ఆరా తీశారు. అలాగే పోలీస్‌స్టేషన్ పరిసరాలు, సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే గ్రామాల గురించి తెలుసుకున్నారు. ఆయుధాల పనితీరును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. పోలీస్‌స్టేషన్‌లో ప్రతీ ఒక్కరు సాంకేతికంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కేసులపై త్వరగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. సమస్యాత్మకమైన గ్రామాల్లో నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు. కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో నూరు శాతం సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గుట్కా, గంజాయి, గుడుంబాతోపాటు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ సంపత్‌రావు, సీఐ మల్లేష్‌యాదవ్, ఎస్సై దాసరి సుధాకర్, సీసీ ఫసియుద్దిన్, తదితరులు ఉన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే