
గోరింటాకు పండుగ
గణపురం: ఆషాఢ మాసం సందర్భంగా మండలకేంద్రంలోని పట్టాభిరామచంద్రస్వామి ఆలయంలో మహిళలు మంగళవారం గోరింటాకు పండుగను నిర్వహించారు. మహిళలు ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకొని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు గోరింటాకును ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలో దాని ప్రాధాన్యతపై ఆలయ అర్చకులు నరేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
వైద్య కళాశాల
ప్రిన్సిపాల్‌గా వెంకటేశ్వర్లు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా జె.వెంకటేశ్వర్లు పదోన్నతిపై రానున్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యద్రాది భవనగిరి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆర్ధోపెడిక్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లుకు ప్రిన్సిపాల్‌గా పదోన్నతి కల్పించారు. అనంతరం చేపట్టిన బదిల్లీ భూపాలపల్లికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజేంద్రప్రసాద్‌కు త్వరలోనే పదోన్నతి రానుంది.
ప్రాజెక్టు పనులకు
సహకరించాలి
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు రైతులు సహకరించాలని సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. కాటారం శివారులోని 501 సర్వే నంబర్‌లో కొనసాగుతున్న పైప్‌లైన్ నిర్మాణ పనులను పలువురు రైతులు కొన్ని రోజులుగా అడ్డుకుంటున్నారు. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని అంతవరకు తమ భూమి వద్దకు రావద్దని భీష్మించారు. సమాచారం తెలుసుకున్న సబ్ కలెక్టర్, డీఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. నిర్వాసిత రైతులు అధికారులతో తమ గోడు వెల్లబోసుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పరిహారం అందేలా చూస్తామని పనులు అడ్డుకోవద్దని రైతులకు నచ్చజెప్పారు. సబ్ కలెక్టర్, డీఎస్పీ వెంట ప్రాజెక్ట్ డీఈఈ ఉపేందర్, సీఐ నాగార్జునరావు, సిబ్బంది ఉన్నారు.
విద్యార్థుల ప్రతిభ
భూపాలపల్లి అర్బన్: నేషనల్ ఎస్‌టీఈఎం ప్రోగ్రామ్‌లో ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల కరస్పాండెంట్ మారుతి, ప్రధానోపాధ్యాయులు ఝాన్సీరాణి తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్(ఎస్‌టీఈఎం) నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూపాలపల్లి సింగరేణి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పూజ్యలక్ష్మి(7వ తరగతి), రుచిత సాయి, దవేరియా(6వ తరగతి) పాల్గొని ప్రథమ స్థానాన్ని సాధించినట్లు తెలిపారు.

గోరింటాకు పండుగ