
ఉత్పత్తికి ఆటంకం కలగొద్దు
భూపాలపల్లి అర్బన్: నేడు(బుధవారం) జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె నేపథ్యంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూడాలని సింగరేణి డైరెక్టర్లు గౌతమ్ పొట్రు, కొప్పుల వెంకటేశ్వర్లు ఏరియా అధికారులను ఆదేశించారు. సమ్మె నేపథ్యంలో మంగళవారం డైరెక్టర్లు ఏరియా జీఎం, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఉద్యోగులందరూ విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమ్మెతో ఉద్యోగులకు ఉపయోగం లేదన్నారు. సింగరేణి పరిధిలో లేని డిమాండ్లు ఉన్నాయన్నారు. సంస్థ పరిధిలో ఉన్న అంశాలను యూనియన్ నాయకులతో చర్చించుకోవచ్చని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, అఽధికారులు మారుతి, మురళీమోహన్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కార్మికులు విధులకు హాజరుకావాలి
సింగరేణి కార్మికులు సమ్మెకు దూరంగా ఉండి నేడు(బుధవారం) విధులకు హాజరుకావాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో కార్మికులతో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కేంద్రం పరిధిలోని డిమాండ్లపై సింగరేణిలో సమ్మె చేయడం వలన సంస్థకు నష్టం జరగడమే కాకుండా కార్మికులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో అధికారులు మారుతి, నారాయణ, చంద్రశేఖర్, సందీప్‌కుమార్ పాల్గొన్నారు.