
అధ్వానం.. పల్లె ప్రకృతివనం
భూపాలపల్లి రూరల్: పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో 10 గుంటల నుంచి ఎకరం వరకు ప్రభుత్వ స్థలాన్ని సేకరించి భారీ సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు ఉదయం నడక కోసం వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేసింది. ప్రారంభంలో నిర్వహణ బాధ్యతను ఉపాధి కూలీలకు అప్పగించగా వారు ఆయా వనాల్లో కలుపు తీయడం, నీరు పట్టడం వంటి పనులు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ బాధ్యతను గ్రామపంచాయతీలకు అప్పగించారు. దీంతో సిబ్బందికి అదనపు పనులు కావడంతో పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అధ్వానంగా తయారయ్యాయి. పలు ప్రకృతి వనాల్లో కలుపు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 241 పంచాయతీల్లో 241 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్రకృతి వనం ఏర్పాటుకు గాను ఉపాధిహామీ పథకం నిధులు రూ.రెండు లక్షల వరకు వెచ్చించారు. కేటాయించిన స్థలంలో వివిధ రకాల మొక్కలు నాటడంతో పాటు చుట్టూ కంచె ఏర్పాటుచేసి గేటు బిగించి పల్లె ప్రకృతి వనాలుగా బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిర్వహణ సరిగా లేక నాటిన మొక్కలు కనిపించకపోగా పిచ్చిమొక్కలతో నిండి దర్శనమిస్తున్నాయి. గేట్లకు తాళం వేసి ఉంచడంతో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. బయటి నుంచి సైతం ముళ్లపొదలు పెరిగి ప్రకృతి వనాలు వాటి ఆనవాళ్లు కోల్పోయాయి. కొన్ని గ్రామానికి దూరంలో ఉన్న ప్రకృతి వనాలు మద్యం తాగడానికి సిగరేట్లు కాల్చడానికి ఆవాసాలుగా మారినట్లు ఆయా గ్రామస్తులు వివరిస్తున్నారు. రూ.కోట్ల ప్రజాదనంలో ఏర్పాటుచేసిన ప్రకృతి వనాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. నిర్వహణ నిల్
పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్న వనాలు
వినియోగంలోకి తీసుకురావాలని ప్రజల వేడుకోలు

అధ్వానం.. పల్లె ప్రకృతివనం

అధ్వానం.. పల్లె ప్రకృతివనం