సాగునీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

సాగునీటి కష్టాలు

Jun 30 2025 4:15 AM | Updated on Jun 30 2025 4:15 AM

సాగున

సాగునీటి కష్టాలు

వాజేడు : తలాపున గోదారి.. ఓ వైపు మోడి కుంట, మరోవైపు గుండ్లవాగు ఉన్నా రైతులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మండలంలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులకు ప్రతిఏటా నీటి కష్టాలు తప్పడం లేదు. రైతులు ఎక్కువగా బోర్లు, కాల్వలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వాజేడులో ఒకవైపు గుండ్లవాగు ప్రాజెక్టు ఉండగా అది లీకులతోనే నీరంతా వృథాగా పోతున్న పరిస్థితి ఉంది. అలాగే మరో వైపు మోడికుంట ప్రాజెక్టు మంజూరైనా నేటి వరకు పనులు చేపట్టక పోవడంతో సాగునీరు ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి. మండలానికి ఎగువ భాగంలో లొట్టిపిట్ట గండి వద్ద గోదావరిపై సమ్మక్క–సారక్క బ్యారేజీ ఉన్నా వాజేడు వైపు కాల్వ లేక సాగునీరు అందడం లేదు.

అలంకారప్రాయంగా గుండ్లవాగు

గుండ్లవాగు ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నాసిరకం నిర్మాణం వల్ల ప్రాజెక్టు మనుగడకే శాపంగా మారింది. ప్రాజెక్టు కింద సాగుచేస్తున్న ఆయకట్టులో ఒక్క ఎకరాకు కూడా నీరు అందడం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రాజెక్టులో నిల్వ ఉండాల్సిన నీరు లీకేజీల కారణంగా బయటకు వృథాగా వెళ్తుడడంతో ప్రాజెక్టు అలంకారప్రాయంగా మారిన పరిస్థితి ఉంది. జలగం వెంగళరావు సీఎంగా ఉండగా 1970లో ఈ ప్రాజెక్టును మంజూరు చేసి ప్రారంభించగా 55ఏళ్లు అవుతున్నా మరమ్మతులతోనే దర్శనమిస్తోంది. ప్రాజెక్టులో ఉండాల్సిన నీరంతా భూగర్భం నుంచి బయటకు వాగులోకి వచ్చి చేరుతుండడంతో నీరు ఎలా బయటకు వెళ్తుందో అర్థంకాక అలా వదిలేశారు. కొంతకాలం తర్వాత జపాన్‌కు చెందిన సాంకేతిక నిపుణులతో అధ్యయనం చేసి ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.14 కోట్ల నిధులు మంజూరు చేసి భూగర్భంలోని రంధ్రాలను పూడ్చారు. వర్షాకాలంలో కాల్వకు గండ్లు పడుతుండటంతో రైతులకు ఇబ్బందిగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,580 ఎకరాల విస్తీర్ణానికి సాగునీరు అందించాల్సి ఉన్నా నేటి వరకు ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదు. ప్రాజెక్టు ప్రధాన కట్ట వద్ద గోడలు కూలిపోతున్నాయి. ప్రాజెక్టు పాతది కావడంతో ప్రధాన గేటు సమీపంలో కొంత భాగం గోడ కూలిపోయింది.

ఎడమకాల్వతో సస్యశ్యామలం

దేవాదుల లక్ష్మీపురం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క–సారక్క బ్యారేజీ వాజేడు మండలానికి లొట్టి పిట్ట గండి వద్ద ఉంది. వాజేడుకు ఆనుకొని ఉన్న బ్యారేజీతో ఇక్కడి రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. లొట్టిపిట్ట గండి వద్ద బ్యారేజీ నుంచి వాజేడు మండలానికి ఎడమ కాల్వను ఇస్తే పంటలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఎడమ కాల్వ ద్వారా నీటిని ఇస్తే వాజేడు మండలం పంటలతో సస్యశ్యామలంగా మారుతుందని అన్నదాతలు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సమ్మక్క–సారక్క బ్యారేజీ నుంచి ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.

ప్రారంభం కానీ మోడికుంట ప్రాజెక్టు పనులు

గుండ్లవాగుకు లీకులు

బోర్లు, కాల్వలపైనే ఆధారం

మోడికుంటకు మోక్షం కరువు

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మోడికుంట ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మండల పరిధిలోని కృష్ణాపురం సమీపంలో మోడికుంట మధ్యతరహా ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ.718 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించేలా అనుమతులు ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు నీటి పారుదల శాఖకు స్పష్టమైన ఆదేశాలు సైతం ఇచ్చినట్లు సమాచారం. గేట్లతో స్పిల్‌వేను నిర్మించడంతో పాటు 1,292 మీటర్ల పొడవు ఆనకట్ట, 21,850 కిలోమీటర్ల పొడవున ప్రధాన కాల్వ నిర్మాణానికి డిజైన్‌ చేసినట్లు తెలిసింది. 28, 950 కిలో మీటర్ల విస్తీర్ణంలో పిల్ల కాల్వలను నిర్మించి 13,591 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా నిర్మించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ, టీఏసీ, పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు గతంలోనే రాగా మోడికుంట ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగుమమైంది. కాని ప్రాజెక్టు పనులు ఇంకా మొదలు కాకపోవడంతో మోడికుంట ద్వారా సాగునీరు అందించడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

సాగునీటి కష్టాలు1
1/2

సాగునీటి కష్టాలు

సాగునీటి కష్టాలు2
2/2

సాగునీటి కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement