
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
భూపాలపల్లి: అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయంచేసే విధంగా చర్యలు తీసుకోవాలని.. నిర్లక్ష్యం వహించవద్దని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 26మంది నుంచి ఎస్పీ తన కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించారు. నడవడానికి ఇబ్బంది పడుతున్న దివ్యాంగుడి దగ్గరకు స్వయంగా వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజాదివస్‌లో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.
సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లండి..
జిల్లాలోని వివిధ కేసుల్లో పోలీస్‌స్టేషన్‌లలో సీజింగ్‌లో ఉన్న 182 వాహనాలను, వెహికల్‌లకు సంబంధించి సరైన పత్రాలు, ఆధార్ కార్డు చూపించి వాహన యజమానులు తీసుకెళ్లాలని ఎస్పీ కిరణ్ ఖరే సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో అందజేసి వాహనాలను తీసుకెళ్లాలని, వాహనాల జాబితాను జిల్లా పోలీస్ వెబ్‌సైట్, ట్విట్టర్, ఎక్స్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆరు నెలల్లోపు తీసుకెళ్లని పక్షంలో వేలం నిర్వహిస్తామన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే
సదానందం సేవలు స్ఫూర్తిదాయకం..
పోలీసుశాఖలో 42 ఏళ్లు సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన రిజర్వ్ ఎస్సై సదానందం సేవలు స్ఫూర్తిదాయకమని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన సదానందంకు శాలువా కప్పి పూలమాల వేసి జ్ఞాపిక అందజేసి ఎస్పీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు నగేష్, రత్నం, శ్రీకాంత్ పాల్గొన్నారు.