భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పాలిసెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసినట్లు పాలిసెట్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎ.రమణారావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ కౌన్సెలింగ్‌లో 218మంది విద్యార్థులు హాజరై తమ ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌లో కళాశాల సిబ్బంది శ్రీధర్, దేవేందర్, టి శ్రీధర్, శ్రీనివాస్, డి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలిగా లావణ్య
భూపాలపల్లి అర్బన్: భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలిగా గొలి లావణ్యను ఎన్నుకున్నట్లు రాష్ట్ర సమితి సభ్యురాలు కొరిమి సుగుణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నిర్మాణసభలో జిల్లా అధ్యక్షురాలిని ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ కగార్‌ను నిలిపేయాలి
రేగొండ: ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం కోసం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులు, మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని నిలిపివేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ 17వ మహాసభ సందర్భంగా ఆదివారం రూపిరెడ్డిపల్లిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల పక్షాన సీపీఐ వంద సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తుందన్నారు. మండలంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడానికి యువకులు, కార్మికులు, రైతాంగాన్ని సమీకరించి పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరాములు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి చంద్రమౌళి, మండల కార్యదర్శి పెంట రవి, సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి, శాంతికుమార్, అన్నారపు రాజేందర్, ప్రకాశ్, పద్మ, భవాని, లలిత, చంద్రమౌళి పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు విద్యార్థి ఎంపిక
కాళేశ్వరం: మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన నాలుగవ తరగతి విద్యార్థి గంట హరిచందన స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశం కోసం రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనేందుకు ఎంపికై నట్లు హెచ్‌ఎం బాలకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్రాను. జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో మొదటిస్థానంలో నిలిచింది. జూలై 1నుంచి హైదరాబాద్ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ పోటీల్లో పాల్గొననుందని ఆయన తెలిపారు.
రేపటినుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకోసం నిర్వహించిన ఈఏపీసెట్–2025 కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఏపీసెట్–2025 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూలై 4వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. అర్హులైన విద్యార్థులు TGEA-PCET. NIC.I N వెబ్‌సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు రెండు జతల జిరాక్స్ తీసుకొని సకాలంలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
నేడు ఉద్యమకారుల దీక్ష
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో నేడు(సోమవారం) తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న శాంతియుత నిరవదిక దీక్షను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద జిల్లాలోని పది మండలాలకు చెందిన ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా హాజరుకావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యకారులకు 250 గజాల ఇంటి స్థలం, రూ.25 వేల పెన్షన్ స్కీం మంజూరు చేయాలని కోరారు.