
భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్త జనంతో కిక్కిరిసింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి ప్రతీ ఆదివారం నిర్వహించే తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.