
నేరాల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేయాలి
● ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి: నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లలో నేరాల నమోదు, పెండింగ్ కేసులు, ఎన్‌బీడబ్ల్యూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు, పోక్సో కేసులు, కోర్టు మానిటరింగ్, శిక్షల అమలుపై చర్చించి పోలీసు అధికారులకు ఎస్పీ మార్గనిర్దేశం చేశారు. విధులను విజిబుల్ పోలీసింగ్‌తో పాటు ప్రభావవంతంగా నిర్వర్తించాలని అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున పోలీసు అధికారులు, సిబ్బంది పకడ్బందీగా పని చేయాలని తెలిపారు. గ్రామాలలో జరిగే శాంతి భద్రతల అంశాలను ముందస్తు సమాచారం సేకరించి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల పనితీరును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఫంక్షన్ వర్టికల్‌లో ఎవరికి కేటాయించిన విధులను వారు అఫ్‌డేట్ చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, భూపాలపల్లి, కాటారం, వర్టికల్ డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, నారాయణనాయక్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.