
చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకోవాలి
రేగొండ: రాష్ట్రంలోని ఏకై క జియో హెరిటేజ్ ప్రదేశంగా ఉన్న పాండవుల గుట్టలను సందర్శించి దాని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకోవాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ మంజు అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్టలను సందర్శించి గుట్ట నిర్మాణ ప్రాముఖ్యతను, వయస్సు, పురాతన శిలా చిత్రాలు వంటి అంశాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన జియో హెరిటేజ్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్ బోర్డును డాక్టర్ మంజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార బోర్డులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌చేస్తే పాండవుల గుట్టలో కనిపించే భౌగోళిక లక్షణాలు, ప్యాలియోలిథిక్ జీవన చరిత్ర ఆధారాలను సందర్శకులు అర్థం చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రమేష్ సామల, గుండా రమేష్, తుషార్ చంద్రపటేల్, అశోక్ కుమార్ కలబతులా హాజరయ్యారు.