కదలని బండి.. తొలగని చెత్త | - | Sakshi
Sakshi News home page

కదలని బండి.. తొలగని చెత్త

Jun 26 2025 6:49 AM | Updated on Jun 26 2025 6:49 AM

కదలని

కదలని బండి.. తొలగని చెత్త

చెత్త సేకరణ ట్రాక్టర్లకు అందని ఇంధనం

ట్రాక్టర్‌ రాక నెల రోజులైంది..

చెత్త ట్రాక్టర్‌ రాక నెల రోజులవుతోంది. ఎండకాలంలో టాక్టరు రాకున్న చెత్తను కాల్చినం. వారం రోజులుగా కొద్దిగా వానలు కురవడంతో చెత్త కాలడంలేదు. చెత్తతోటి ఈగలు, దోమలు ఎక్కువయ్యాయి. గ్రామంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. అధికారులు స్పందించి చెత్తను తీయించాలి.

– పాలకుర్తి కళమ్మ, కమలాపూర్‌

నిధులు లేవు

పంచాయతీల్లో ట్రాక్టర్‌ డీజిల్‌, మరమ్మతులకు నిధులు లేవు. 18 నెలలుగా నిధులు రావడంలేదు. కార్యదర్శులు ఇప్పటికే రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ఇంటి పన్నులు వసూలు చేసిన నిధులు ట్రెజరీల్లో నిల్వ ఉంచారు. ప్రభుత్వం ట్రెజరీల నుంచి నిధులు విడుదల చేయించాలి. ప్రతినెలా టాక్టర్‌, వీధిలైట్లు, తదితర ఖర్చుల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలి.

– రాంబాబు, జిల్లా అధ్యక్షుడు,

పంచాయతీ కార్యదర్శుల సంఘం

చెత్త సేకరణపై చర్యలు తీసుకుంటాం

గ్రామాల్లో చెత్త తీస్తున్నారు. గతంలో కొంతమంది కార్యదర్శులు తాళాలు ఇచ్చి మళ్లీ తీసుకెళ్లారు. గ్రామాల్లో చెత్త తీస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడైనా చెత్త సేకరణపై సమస్యలుంటే చర్యలు తీసుకుంటాం.

– వీరభద్రయ్య, డీపీఓ

మల్లంపల్లిలో వృథాగా ఉన్న ట్రాక్టర్‌

భూపాలపల్లి రూరల్‌: పల్లెల్లో చెత్తసేకరణ నత్తనడకన సాగుతోంది. నిరంతరం కొనసాగాల్సిన ఈ ప్రక్రియ.. వారంలో ఒకటి, రెండు దఫాలే జరుగుతోంది. ట్రాక్టర్లలో డీజిల్‌ లేకపోవడమే ఇందుకు కారణం. సర్పంచ్‌ల పదవీకాలం ముగియడం.. ప్రభుత్వాలనుంచి నిధులు నిలిచిపోవడం.. పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మొన్నటి వరకు అప్పు చేసి పనులు చేపట్టిన పంచాయతీ కార్యదర్శులు ఆర్థికభారం భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాక్టర్ల నిర్వహణ చూడలేమంటూ కొంత మంది కార్యదర్శులు ఇటీవల మండల పరిషత్‌ కార్యాలయాల్లో తాళం చేతులు అప్పగించారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పెద్ద పంచాయతీల్లో ఇంటి పన్నులు తదితర నిధులు.. గ్రామ కార్యదర్శులు సొంత ఖర్చులతో వారంలో ఒకటి రెండుసార్లు ట్రాక్టర్లు తీస్తున్నట్లు సమాచారం. కానీ, చిన్న పంచాయతీల్లోని ట్రాక్టర్లకు డీజిల్‌ లేక షెడ్లకే పరిమితం అయ్యాయి.

పేరుకుపోతున్న చెత్త..

గ్రామ పంచాయతీల్లో దుర్గంధం నెలకొంది. క్రమం తప్పకుండా చెత్త సేకరణ జరగకపోవడం, మరోవైపు వానాకాలం కావడంతో గ్రామాల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారంలో ఒకటి రెండు దఫా చెత్త సేకరిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో ఊరిబయటకే చెత్త తరలించి దహనం చేస్తున్నారు. కొందరు తమ ఇళ్లలోని చెత్తను స్వయంగా డంపింగ్‌ యార్డులకు తీసుకెళ్లి పడేస్తున్నారు.

కార్యదర్శుల పైనే భారం..

సుమారు 18 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, ప్రత్యేకాధికారులు గ్రామాలవైపు చూడకపోవడంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపైనే పడుతోంది. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ఇంతకాలం సొంతఖర్చులతో సమస్యలు పరిష్కరించిన పంచాయతీ కార్యదర్శులు ఇక భరించలేమంటున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్ల నిర్వహణ భారం తడిసి మోపడవుతుందని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడం, ఆర్థిక భారం తమపైన పడుతుండడంతో భరించలేని పంచాయతీ కార్యదర్శులు తమ అసోసియేషన్‌ పిలుపు మేరుకు ట్రాకర్ల నిర్వహణ చూడలేమంటూ మండల పరిషత్‌ కార్యాలయాల్లో తాళం చేతులు అప్పగించారు. కానీ, కొంతమంది మళ్లీ తీసుకెళ్లినట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ ప్రతిరోజూ చేపట్టాలని ప్రజలు కోరుతుండగా.. నిర్వహణ భారం తమపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.

ఇంటింటి చెత్త సేకరణకు ఆటంకం

చిన్న పంచాయతీల్లో పూర్తిగా బంద్‌

దుర్గంధం వెదజల్లుతున్న పల్లెలు

నిధులు నిల్‌..!

పల్లెల్లో చెత్త సేకరణ, మొక్కలకు నీరు పోసేందుకు గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున ట్రాక్టర్‌, ట్యాంకర్‌ మంజూరు చేసింది. అందులో భాగంగా జిల్లాలోని 241 జీపీలకు ఒక ట్రాక్టర్‌, చెట్లకు నీరు పోసేందుకు ఒక ట్యాంకర్‌ చొప్పున పంచాయతీలు ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేశాయి. మేజర్‌ పంచాయతీల్లో ప్రతి రోజూ, చిన్న గ్రామ పంచాయతీల్లో రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా చెత్త సేకరించాల్సి ఉంటుంది. పెద్ద పంచాయతీలో డీజిల్‌ ఖర్చు నెలకు రూ.10 వేల వరకు, చిన్న గ్రామ పంచాయతీలో రూ.5 వేల చొప్పున ఖర్చు వస్తుంది. అయితే పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగియడంతో 15 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ఈ ట్రాక్టర్ల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది.

కదలని బండి.. తొలగని చెత్త1
1/5

కదలని బండి.. తొలగని చెత్త

కదలని బండి.. తొలగని చెత్త2
2/5

కదలని బండి.. తొలగని చెత్త

కదలని బండి.. తొలగని చెత్త3
3/5

కదలని బండి.. తొలగని చెత్త

కదలని బండి.. తొలగని చెత్త4
4/5

కదలని బండి.. తొలగని చెత్త

కదలని బండి.. తొలగని చెత్త5
5/5

కదలని బండి.. తొలగని చెత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement