
సింగరేణి పైరవీకారులపై ఏసీబీ దాడులు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి పైరవీకారులపై విజిలెన్స్ విచారణతోపాటు ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. సింగరేణిలో అవినీతి పెరిగిపోవడంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏసీబీ నిఘా పెట్టింది. సింగరేణి మెడికల్ బోర్డులో అవినీతి చాపకింద నీరులా విస్తరిస్తుంది. పలువురు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, చోట మొటా కార్మికులు సైతం లంచావతారమెత్తి సంస్థకు చెడు పేరును తీసుకొస్తున్నారు. ఈక్రమంలో భూపాలపల్లి ఏరియా కేటీకే 1వ గనిలో విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి కార్మికుడు సాదర్ల ప్రశాంత్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
గత ఏడాది నుంచి విచారణ
గతేడాది జనవరిలో మెడికల్ బోర్డులో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై సంస్థ దృష్టి సారించింది. అందులో భాగంగా కారుణ్య నియామకాల్లో జరిగే అవినీతిపై నజర్ పెట్టాల్సిందిగా కోరుతూ సీఐడీ, ఏసీబీలను కోరుతూ 2024 జనవరిలో లేఖలు రాసింది. ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చే యాలంటూ సంస్థ కోరింది. అప్పటికే ఆరేడేళ్లుగా ఈ దందా సాగుతుండడంతో ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గతేడాది మేలో మెడికల్ బోర్డు అవినీతిపై కచ్చితమైన సమాచారం అందిస్తే రూ.10వేల బహుమతి అందిస్తామని, వివరాలు గోప్యంగా ఉంచుతామని సంస్థ పే ర్కొంది. అవినీతి వివరాలు తెలిపేందుకు ప్రత్యేకంగా 94911 44104 వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తెవడంతో ఫిర్యాదు రావడం మొదలైంది.
రూ.లక్షల్లో వసూళ్లు
సింగరేణి సంస్థలో ఒకప్పుడు వారసత్వ ఉద్యోగాలు ఉండగా.. 90వ దశకంలో ఈ విధానాన్ని రద్దు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారసత్వ ఉద్యోగాల అంశం తెరమీదకు వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తే.. చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. దీంతో వారసత్వ ఉద్యోగాలకు అనధికారిక ప్రత్యామ్నాయంగా 2017లో కారుణ్య నియామకాలు తిరిగి మొదలయ్యాయి. అయితే కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది దళారులు డబ్బులు ఇస్తేనే ఉద్యోగాలు వస్తాయంటూ ప్రచారం చేశారు. చివరకు ఈ ప్రచారం బహిరంగంగానే స్థిరపడిపోయి ఒక్కో ఉద్యోగానికి కార్మికులు కనిష్టంగా రూ.ఐదు లక్షలు సిండికేట్‌కు ముట్టచెబితే తప్ప పని కాదనే నమ్మకానికొచ్చారు కారుణ్య నియామకాలకు వెళ్లే కార్మికులు.
ప్రత్యేక నిఘా పెట్టి..
సింగరేణి కారుణ్య నియామకాల దందాపై సీబీఐ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వేర్వేరు ఫోన్ కాల్స్ ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించి, పక్కా ఆధారాలతో ఈ ఏడాది మే 6న కొత్తగూడెం మెయిన్ వర్క్‌షాపులో పని చేస్తున్న అన్నెబోయిన రాజేశ్వరరావు అనే ఉద్యోగిని ఏసీబీ అధికారులు టార్గెట్ చేశారు. అతని బ్యాంక్ ఖాతాల్లో రూ.32 లక్షల విలువైన నగదు ఉన్నట్టుగా గుర్తించారు. అతన్ని విచారిస్తే లభించిన సమాచారం. అప్పటికే తమ దగ్గరున్న వివరాలు, ఫిర్యాదుదారులు చెప్పిన అంశాలను బేరీజు వేసుకుని సరిగ్గా నెల రోజుల తర్వాత జూన్ 5న కొత్తగూడెం పట్టణంలో మరో మహిళ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ప్రస్తుతం ఆమె నుంచి వివరాలు రాబట్టే పని చేస్తున్నారు. వారి విచారణలో భూపాలపల్లి ఏరియాకు చెందిన ప్రశాంత్ సమాచారం బయటికి వచ్చింది. అంతేకాకుండా డబ్బులిస్తే కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు దండుకుంటున్న సంస్థేతర వ్యక్తులకు సంస్థలో ఉన్న ఉద్యోగులకు మధ్య జరిగిన లావాదేవీలపై పక్కా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.
ఏసీబీ అధికారుల అదుపులో సింగరేణి కార్మికుడు
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి కార్మికుడు సాదర్ల ప్రశాంత్‌ను బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్, బృందం పట్టణంలోని ప్రశాంత్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. బ్యాంక్ అకౌంట్లు పరిశీలించి సెల్‌ఫోన్ తనిఖీ చేసి వారి వెంట తీసుకువెళ్లి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు సమాచారం. సింగరేణి కారుణ్య నియామకాలు, కార్మికులను బదిలీలు చేయించేందుకు పలువురు కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. కొత్తగూడెం ఏరియాలోని రాజేశ్వర్‌రావు అనే కార్మికుడితో కలిసి పైరవీలకు పాల్పడ్డాడని గుర్తించారు. గత ఏడాది నుంచి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి విజిలెన్స్ విభాగం, ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణంలో ప్రశాంత్ పట్టుపడగా మరికొంతమంది పైరవీదారులు చిక్కే అవకాశం ఉంది.
సింగరేణిలో యథేచ్ఛగా
కారుణ్య నియామకాలు
ఉద్యోగాల పేరిట
కార్మిక కుటుంబాలపై వల
ఏడాదిన్నరగా మెడికల్ దందాపై నజర్
దాడులు, అరెస్టులు ప్రారంభించిన
ఏసీబీ అధికారులు