
అర్హత పరీక్షలో ఎంపిక కాలేదని ఆత్మహత్య
కాటారం(మహాముత్తారం): డిఫెన్స్ అకాడమీ అర్హత పరీక్షలో ఎంపిక కాలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహాముత్తారం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండల కేంద్రంలోని నేతకానిపల్లికి చెందిన మంతెన రంజిత్(15) ఇటీవల పదవ తరగతి పాసయ్యాడు. డిఫెన్స్‌లో పనిచేయడంపై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు కరీంనగర్‌లోని శ్రీ చైతన్య డిఫెన్స్ అకాడమీలో చేర్పించారు. అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అర్హత పరీక్షలో రంజిత్ క్వాలిఫై కాలేదు. దీంతో ఇంటికి తిరిగి వచ్చిన రంజిత్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 23న ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యుల సూచన మేరకు వరంగల్ ఆస్పత్రికి తరలించగా రంజిత్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి రాజబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రాజయ్య తెలిపారు.