
‘ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి’
ములుగు రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌశిక్‌రెడ్డి ఎన్నికల్లో గెలిపించకపోతే కుటుంబంతో సహ ఆత్మహత్య చేసుకుంటామని ప్రజలను బ్లాక్‌మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి సీతక్క గురించి మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బంగడుపుతున్నారని విమర్శించారు. కౌశిక్‌రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో తన్నులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, పౌడాల ఓం ప్రకాశ్, కంబాల రవి, నల్లెల భరత్, యాసం రవికుమార్, షకిల్, అనిల్, బోడ రఘు తదితరులు పాల్గొన్నారు.