
దిగుమతి భారం తగ్గించేందుకే ఆయిల్‌పామ్ సాగు
గోవిందరావుపేట: దేశంలో వంటనూనె దిగుమతి భారాన్ని తగ్గించేందుకే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయని జిల్లా ఉద్యాన అధికారి దండు సంజీవరావు అన్నారు. మండల పరిధిలోని రాంనగర్ గ్రామంలో రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ దేశంలో వంట నూనె ఉత్పత్తి 16.69 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా 33.20 మిలియన్ మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతుందన్నారు. దేశంలో పామ్ ఆయిల్ 259 లక్షల టన్నులు వినియోగానికి అవసరం కాగా 100 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీకాంత్, కేఎన్ బయో సైన్స్ మండల ప్రతినిధి సురేష్, నవీన్ నాయక్, రైతులు సోనియా నాయక్, మోహన్ పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన అధికారి సంజీవరావు