
23న ఒలింపిక్ డే రన్
భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ ఒలింపిక్ డేను పురస్కరించుకొని ఈ నెల 23న రన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సీహెచ్.రఘు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6గంటలకు జిల్లాకేంద్రంలోని హన్‌మాన్ దేవాలయం నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని క్రీడాసంఘాల సభ్యులు, క్రీడాకారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ సభ్యులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
మినీ స్టేడియం
ఏర్పాటు చేయాలని వినతి
కాటారం: మండలకేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. కాటారం శివారులో ఊర చెరువును ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో సర్వే నంబర్ 71లో మినీ స్టేడియం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కోరారు. స్టేడియం ఏర్పాటుతో యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడకుండా ఉంటారని పేర్కొన్నారు. గతంలో సర్వే నంబర్ 49 తిమ్మనకుంట శిఖం భూమిలో స్టేడియం ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులు, నాయకులు ఆర్బాటాలు చేసి ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదని అన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్, బీఎస్పీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు రాజ్‌కుమార్, రైతు సంఘం నాయకులు గుమ్మడి తిరుపతి ఉన్నారు.
వాహనాల తనిఖీ
టేకుమట్ల: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ అంతిమయాత్రకు శుక్రవారం రాష్ట్రం నలు మూలల నుంచి వాహనాల్లో హాజరయ్యారు. వారి వాహనాలను మండలకేంద్రంలోని టేకుమట్ల–ఆశిరెడ్డిపల్లి ప్రధాన రోడ్డులో పోలీసులు నిలిపి విస్తృతంగా తనిఖీచేశారు. గాజర్ల రవి అంత్యక్రియల్లో పోలీసులు మఫ్టీలో గస్తీ నిర్వహించారు.
జిల్లా అధ్యక్షుడిగా
సత్యనారాయణ
భూపాలపల్లి రూరల్: బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడిగా భీమనాథుని సత్యనారాయణ ఎన్నికయ్యారు. జిల్లా రెండో మహాసభ శుక్రవారం జిల్లాకేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీకాంత్, సహాయ కార్యదర్శులుగా క్యాతరాజు సతీష్, అస్లాం, జిల్లా ఉపాధ్యక్షులుగా మేరుగు రమేష్, గోలి లావణ్య, జిల్లా కోశాధికారిగా కట్టెగొల్ల భారతి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా రమేష్ చారి, మహేష్,పుప్పాల వనిత, సుధాకర్, శేఖర్, అజయ్, భగత్ లను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు తెలిపారు.
వరల్డ్ రికార్డ్‌కు
అలకనంద ఎంపిక
మల్హర్: మండలంలోని అన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన భరతనాట్య వర్థమాన నృత్య కళాకారిణి బానోతు అలకనంద వర్డల్ రికార్డ్‌కి ఎంపికై నట్లు తల్లిదండ్రులు బానోతు రాజకుమార్ దివ్య తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. అలకనంద మూడు సంవత్సరాల నుంచి ఎన్నో వేదికలపై తన భరతనాట్య నృత్య ప్రదర్శనలు ఇస్తూ ప్రముఖుల ద్వారా 20 జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుందన్నారు. అలకనంద నృత్య ప్రదర్శనలను పరిశీలించిన అనంతరం ప్రముఖ రాయల్ ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు, 21 సెంచరీ ఇంటర్‌నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థల ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ ఎం.హారిక, తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోర్టినేటర్ ఇసపల్లి నరేశ్ ఆమెను వరల్డ్ రికార్డుకు ఎంపిక చేస్తూ నియామక పత్రం ఇచ్చినట్లు రాజ్‌కుమార్ తెలిపారు. వరల్డ్ రికార్డుకు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేశారు.

23న ఒలింపిక్ డే రన్