మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ములుగు రూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో కుట్టుమిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు, ధ్రువపత్రాలను మంత్రి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు నైపుణ్యం లేని కారణంగా ఉపాధికి దూరంగా ఉంటున్నారన్నారు. ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు యూనిఫాం కుట్టే పనితో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. 15నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు అందరూ తప్పకుండా మహిళా సంఘాలలో చేరాలని సూచించారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్‌లు, ఇందిరా శక్తి క్యాంటీన్లు, బస్సులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలలో చేరిన చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి తుల రవి, డీఎస్పీ రవీందర్, ట్రైబల్ వెల్పేర్ డీడీ పోచం, ఎంపీడీ రామకృష్ణ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం అధికారి రమాదేవి, డీసీపీఓ ఓంకార్, సీడీపీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రం నుంచి పొట్లాపూర్ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణ పనులకు అంచనా విలువ రూ.19 కోట్లతో రోడ్డు వెడల్పు, పటిష్ట పరిచేందుకు నిధులు కేటాయించినట్లు వివరించారు.


