కంకర వేశారు.. తారు మరిచారు
రేగొండ: మండలంలోని రేపాక గ్రామంలో బస్టాండ్ నుంచి గ్రామ శివారు వరకు రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై ప్రతీ రోజు రైతులు, వాహనదారులు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. నూతన రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా గ్రామంలో సుమారుగా మూడు కిలోమీటర్ల వరకు సంవత్సరం క్రితం కంకర వేశారు. కంకర వేసి దానిపై తారు వేయకపోవడంతో వాహనదారులకు, రైతులకు తిప్పలు తప్పడం లేదు. కంకర ఉండడంతో ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులు అదుపు తప్పి పడిపోయి ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఈ దారి గుండా అధిక సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో దుమ్ము లేచి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులు, ప్రయాణికులు కోరుతున్నారు.


