నేడు శ్రీలక్ష్మినరసింహస్వామి కల్యాణం
భూపాలపల్లి అర్బన్: ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట) ఆధ్వర్యంలో నేడు(శనివారం) జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలోని శ్రీసీతారామాంజనేయస్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మినరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉత్సవ విగ్రహాల రథంతో పట్టణంలోని వీధుల్లో ఊరేగింపు నిర్వహించి అధికారులతో కలిసి వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. మంజూర్‌నగర్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా కలెక్టర్ రాహుల్‌శర్మ కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా జిల్లాకు రథం రావడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ రవి, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, ఏఓ మురళీధర్, అధికారులు పాల్గొన్నారు.


